TDP Alliance : కూటమే..కానీ 4 దాక ఆగాల్సిందే..

TDP Alliance

TDP Alliance

TDP Alliance : ప్రతీ ఎన్నికలలో ఏదో ఒక పార్టీ గెలిచి అధికారంలోకి రావడం సర్వసాధారణం. కానీ ఈ సారి ఏపీలో ఎన్నికలు ఓ యుద్ధంలా జరిగాయి.  దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే నడుస్తోంది.  ఈసారి ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో  కూటమా… వైసీపా? అంటూ అందరి దృష్టి ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదల అవుతాయా అని ఇటు వైసీపీ.. అటు టిడిపి, జనసేన, బీజేపీలతో పాటు సామాన్యులు కూడా  ఆతృతగా ఎదురు చూడటం విశేషం.  ఈసారి కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

పార్టీలకు చెందిన నాయకులకు ఫలితాలపై ఎంత ఆందోళన ఉందో తెలియదు కానీ.. సామాన్యులు మాత్రం జూన్ 4వరకు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఒక్కో రోజూ ఒక్కో యుగం అన్నట్లు చాలా భారంగా గడుస్తోందని చెప్పుకొస్తున్నారు. ఫలితాల కోసం జూన్ 4వరకు ఎదురుచూడటం చాలా కష్టంగా ఉందంటున్నారు.  దీనిని బట్టి జగన్‌ ప్రభుత్వం, పాలన, వైసీపీ నేతల ధోరణితో రాష్ట్ర ప్రజలు ఎంతగా విసుగెత్తిపోయారో  అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల సంఘం జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్  నిషేధించింది.  కనుక మీడియా, సర్వే సంస్థలన్నీ ఫలితాలను అంచనా వేసి నివేదికలు సిద్ధంగా ఏం చేయలేక ఖాళీగా కూర్చున్నాయి.  అయితే సోషల్ మీడియాకు కట్టుబాట్లు లేవు కనుక కొందరు ప్రముఖులు, రాజకీయ నిపుణులు తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నారు. అటువంటి మరో అంచనా ప్రకారం, ఏపీ శాసనసభ ఎన్నికలలో టీడీపీకి 109, జనసేన 10-12, బీజేపీ 3-4 కలిపి 175కి కూటమికి 120-125 వరకు సీట్లు గెలిచి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.  అదే అంచనా ప్రకారం వైసీపీకి 43-47 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందట. ఇక  25 లోక్‌సభ సీట్లలో టీడీపీ 14, జనసేన 2, బీజేపీ 3, కలిపి మొత్తం 19 సీట్లు గెలుచుకోబోతుండగా, వైసీపీ 6 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సదరు సర్వే సంస్థ అంచనా వేసింది.  2019లో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024లో జరిగిన రెండో ఎన్నికలోనే ఘోరంగా ఓడిపోతే, జగన్ చెప్పుకున్నట్లు జూన్ 4న  దేశమంతా ఈ ఓటమిని చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు.

TAGS