Pithapuram : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గుడువుగా నిర్ణయించారు అధికారులు. జగన్ 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠీపురంలో 23న నామినేషన్ దాఖలుకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు బీజేపీ, జనసేన నుంచి పోటీ చేయడంపై వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం లో పవన్ కు పోటీగా రాబోతున్న వారి గురించి సజ్జల కొత్త సందేహం లేవనెత్తారు.
పొత్తులో సఖ్యత లేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలను ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారని సజ్జల ఆరోపించారు. భీమవరం, అవనిగడ్డలో అదే జరిగిందని చెప్తున్నారు. అనపర్తిలోనూ టీడీపీ అభ్యర్థిని బీజేపీలోకి పంపి అక్కడ టికెట్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ, జనసేనకు సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి బాబు తమ వారితో పోటీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కనీసం రెండేళ్లయినా సీఎం పదవి దక్కాలని జనసైనికులు కోరుకుంటున్నారని వివరించారు. బాబు పొత్తులో పవన్ కు తొలత 24 సీట్లు ఇచ్చి.. చివరకు 21 సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
పిఠాపురం నుంచి పవన్ పోటీ నుంచి తప్పుకోవచ్చని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాలనే పవన్ తప్పుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. మొత్తం సీట్లలో తనకు పట్టు ఉండాలనేది బాబు ఆలోచనగా కనిపిస్తుందని చెప్పారు. పిఠాపురంలో పవన్ ను తప్పించి వర్మను దించుతారేమోనని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక వైపు బీజేపీతో, మరో వైపు కాంగ్రెస్ తో జత కట్టారని విమర్శించారు.
అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందించిన తమ పార్టీ ఈ ఎన్నికల యుద్ధానికి సిద్ధమైందని సజ్జల చెప్పుకొచ్చారు. బాబు కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచించారు. టీడీపీకి మద్దతిచ్చే ఎన్ఆర్ఐలు గ్రామాల్లో డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ఆర్ఐ పేరుతో గ్రామాల్లో తిరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే విషయంలో వైసీపీ శ్రేణులు అలర్ట్ అవ్వాలని పిలుపునిచ్చారు. బ్యాంకును మోసం చేసినా వారికి పక్కన పెట్టుకొని చిరంజీవి మాట్లాడారన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే మెగాస్టార్ రావచ్చని.. ఎవరికీ అభ్యంతరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.