Vellampalli Srinivasarao : వెల్లంపల్లి పాపాలే..ఆసిఫ్ కు శాపాలు..విజయవాడ వెస్ట్ లో శ్రీనివాసరావు అరాచకాలు తెలియంది ఎవరికీ?
Vellampalli Srinivasarao : ‘‘ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్..గడిచిన ఐదేండ్లలో చేయని అరాచకం లేదు. ఆయన పాలన అంతా అవినీతి మయమే. ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. కబ్జాలు, దోపిడీలు, ఇసుక దందాలు..ఇలా ఒక్కటేమిటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. సీఎం కంటే తాము తక్కువేమి తినలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ వారు అందిన కాడికి దోచుకున్నారు.’’ అని వైసీపీ దందాలను ప్రతిపక్షాలు నిత్యం ప్రజల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాయి. ఇవన్నీ కళ్లార చూసినా ప్రజలు ఇక చాలురా బాబూ జగన్ పాలన అంటూ ఎన్డీఏ కూటమి గెలపునకు సై అంటున్నారు.
అధినేత కంటే తాను తక్కువేమీ కాదని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజలను దోచుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఆయన చేసిన పాపాల వల్లే నియోజకవర్గం నుంచి మార్చి కొత్త అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ను నియోజకవర్గ ఇన్ చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావును నియమించారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కొత్త సమస్యలను కొని తెస్తోంది. వెల్లంపల్లి పాపాలే ఆసిఫ్ కు శాపంగా మారాయి. చివరకు బలమైన కూటమి అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరిపై ఆసిఫ్ గెలవడం అసాధ్యమని జగన్ అంచనాకు వచ్చి ఆసిఫ్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ అండ చూసుకుని వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అక్రమాలకు కొదువే లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. వెల్లంపల్లి అవినీతి చరిత్ర చెబితే పెద్ద పుస్తకమే రాయవచ్చని టీడీపీ నేత జలీల్ ఖాన్ గతంలో ఎన్నో సార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వెల్లంపల్లికి దేవుడన్నా, పెద్దలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలోని దేవాలయాల హుండీల కన్నా వెల్లంపల్లి హుండీనే ఎక్కువగా నిండిందని ఆయన ఎద్దేవా చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా దుర్గమ్మ సన్నిధిలోని స్క్రాప్ ను రూ.15లక్షలకు అమ్మేసుకున్నాడని, దాని విలువ దాదాపు రూ.కోటి 50 లక్షల వరకు ఉంటుందని జలీల్ ఖాన్ తెలిపారు. దేవాలయాల్లో ఈవోలను మార్చినందుకు వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. వెల్లంపల్లి మంత్రిగా పనిచేసినప్పుడు దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తే.. వెల్లంపల్లి అమ్మవారి దేవాలయంలోని ప్రతీ వస్తువును అమ్మకోవడానికే ప్రాధాన్యమిచ్చాడన్నారు. వెల్లంపల్లి నిర్వాకాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా జలీల్ ఖాన్ అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించారు.
అలాగే వెల్లంపల్లికి అక్రమాలపై టీడీపీ నాయకుడు డూండీ రాకేశ్ కూడా గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. వెల్లంపల్లి రూ.1500 కోట్ల దోపిడీ చేశాడని, ఆయన అవినీతి చరిత్ర విజయవాడ ప్రజలే కాదు రాష్ట్రమంతటికీ తెలుసన్నారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడిలో అవినీతి రాజ్యమేలిందని టీడీపీ నాయకులు విమర్శిస్తుంటారు.
ఇదిలా ఉండగా జనసేన నుంచి సీటు రాకపోవడంతో పోతిన మహేశ్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. మహేశ్ జనసేనలో ఉన్నప్పుడు వెల్లంపల్లి అవినీతిపై విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడం గమనార్హం. నియోజకవర్గంలో వెల్లంపల్లి అవినీతిపై నాగబాబు అనే యువకుడు ఎండగడితే అతన్ని అరెస్ట్ చేయాలని వెల్లంపల్లి పోలీసులకు హుకుం జారీ చేస్తే అతన్ని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. దీనిపై అప్పట్లో టీడీపీ, జనసేన తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అప్పటి జనసేన నాయకుడు పోతిన మహేశ్ పోలీసులతో మాట్లాడి విడిపించుకు వెళ్లారు. వెల్లంపల్లి అవినీతి, అక్రమాలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ప్రశ్నిస్తుండడంతో అక్రమ అరెస్ట్ లు చేయిస్తున్నాడని పోతిన మహేశ్ మండిపడ్డారు. అయితే ప్రస్తుతం మహేశ్ అదే అవినీతి పార్టీలోకి వెళ్లడాన్ని స్థానిక ప్రజలు సహించలేకపోతున్నారు.
2019లో వైసీపీ తరపున గెలిచిన వెల్లంపల్లి చేసిన అరాచకాలతో ప్రస్తుత అభ్యర్థి ఆసిఫ్ కు తీవ్ర కష్టాలు ఏర్పడుతున్నాయి. వెల్లంపల్లి 2019 ఎన్నికలకు ముందు స్థానిక వ్యాపారుల నుంచి ఆర్థిక సాయం పొంది ఆ తర్వాత వారిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని అంటుంటారు. నియోజకవర్గంలో ఆయన చేయని దోపిడీ లేకపోవడంతో వెల్లంపల్లి ఓటమి ఖాయమని భావించినా జగన్ అతన్ని మరో నియోజకవర్గానికి మార్చారు. అలాగే గత ఐదేండ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఇవన్నీ ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ను నియోజకవర్గంలోకి వెళ్లనివ్వకుండా చేస్తున్నాయి. వైసీపీ ముఖ్యంగా మైనారిటీ ఓట్లను నమ్ముకున్నా..ఆ ఓట్లతో ఆసిఫ్ గెలవడం అసాధ్యం. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అధికార పార్టీపై, గత ఎమ్మెల్యే వెల్లంపల్లిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఓటు వేయడం ద్వారా మాత్రమే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఓటర్లు భావిస్తున్నారు.