Medaram Jathara : వీరవనితలు..కోట్లాది మంది ఆరాధ్యాలు.. సమ్మక్క, సారలమ్మ చరిత్ర ఇది..

Medaram Jathara

Medaram Jathara

Medaram Jathara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతర రేపు ప్రారంభం కాబోతోంది. రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మల దర్శనానికి రానున్నారు. ఇప్పటికే 60లక్షలకు పైగా తల్లులను దర్శించుకోగా, జాతర జరిగే ఆ మూడు రోజులు కోటిన్నర భక్తులకు పైగా రానున్నారు.

బుధవారం సారలమ్మ రాకతో జాతర మొదలవుతుంది. గురువారం సమ్మక్క ఆగమనంతో మహాజాతర తారాస్థాయికి చేరిపోతోంది. ఆ తర్వాతి రోజు శుక్రవారం గద్దెల పై ఇద్దరు అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. అనంతరం వనప్రవేశం ఉంటుంది. రెండేండ్లకు ఒకసారి వచ్చే మహా జాతర చరిత్ర ఏంటి? కోట్లాది భక్తులు ఆరాధించే సమ్మక్క సారక్క ఎవరు? అసలేంటి మేడారం జాతర వెనక ఉన్న నేపథ్యం ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కాకతీయులు పాలిస్తున్న కాలమది. ఆ సమయంలో జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను కోయదొర మేడరాజు పాలిస్తుండేవాడు. ఆయన కాకతీయులకు సామంతుడు. మేడరాజు ఒకసారి వేటకు వెళ్లగా అడవిలో వారికి పెద్దపులుల కాపలా మధ్య ఓ పసికందు కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకెళ్లాడు మేడరాజు. ఆమె రాకతో గూడెంలో అన్ని శుభాలే జరుగుతుండడంతో ఆమెను వనదేవతగా భావించారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. ఆమెను పెంచి పెద్దచేసిన మేడరాజు..మేడారంకు చెందిన మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి సమ్మక్కకు వివాహం చేస్తాడు. దీంతో సమ్మక్క మేడారం చేరుకుంటుంది.

కాకతీయుల రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంతుడిగా పాలిస్తుండేవాడు. సమ్మక్క, పగిడిద్దరాజులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. అయితే కరువుకాటకాలతో పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు. తీవ్ర కరువు ఉందని, కప్పం కట్టలేమని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి పగిడిద్దరాజు చెబుతాడు. దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మేడారంపైకి తన సైన్యాన్ని పంపుతాడు. ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకుని గిరిజనులకు, కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సమ్మక్క కు కూడా వీరోచితంగా పోరాడుతుంది. కాకతీయ సేనలు వెన్నుపోటుతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు ప్రాణాలు కోల్పోతారు.

వీరి మరణవార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టంలేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు. అదే ఇప్పుడు జంపన్న వాగు అయ్యింది. తన కుటుంబ మరణవార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడుతుంది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కాకతీయ సేనలు వెనక నుంచి వచ్చి దాడి చేయడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్లి అంతర్థానమైంది.

ఆ తర్వాత కుంకుమ భరిణె రూపంలో గిరిజనులకు దర్శనం ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారుతాడు. రెండేండ్లకొకసారి జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయిస్తాడు. అయినా కూడా గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితంగా అతి తొందరలోనే అంటే 1323లోనే కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.

TAGS