Devineni Uma : టీడీపీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, పెనమలూరు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీకి ఈ రెండు నియోజకవర్గాలు కంచుకోటలు అని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేసి పునర్వైభవం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో సీటు కోసం బలమైన అభ్యర్థులు పోటీ పడుతుండడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోయారు. తర్జనభర్జనల తర్వాత మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ , పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని ఉమా మహేశ్వరావులను దాదాపు ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మైలవరం తాజా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వదిలి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్నుంచే ఈ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చాయి. మైలవరం టికెట్ కోసం దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు నడుస్తుండగా..మధ్యలో వసంత కృష్ణప్రసాద్ రావడంతో ఇక్కడ అంతర్గత పోరు తీవ్రమైంది. చివరకు ఉమా, సుబ్బారావు ఒక్కటయ్యారు. టికెట్ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు పక్కా ప్రణాళికతో వారిద్దరిని ఒప్పంచి వసంతను మైలవరం అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న ఉన్న టీడీపీ క్యాడర్ సర్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో తుది విడతలో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.
ఇక పెనమలూరు నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసినా దాదాపుగా దేవినేనిని బరిలో దింపేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మైలవరం వసంతకు అప్పగించాలని, పెనమలూరులో టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయని దేవినేనికి సర్దిచెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. దీంతో రెండు కీలక నియోజకవర్గాల్లో అంతర్గత పంచాయితీకి అధినేత చంద్రబాబు తెరదించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతల ఎంపికతో ఈ రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.