Vangaveeti Radha : జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి తన వ్యూహాలను పదునుపెడుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. ఈనేపథ్యంలోనే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
సోమవారం రాత్రి తెనాలిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో నాదెండ్లను రాధా కలిశారు. ఇరువురూ మంచి ఫ్రెండ్స్ కావడంతో సాధారణ విషయాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం.
ఇప్పటికే కాపు నాయకులు కొందరు వైసీపీలో చేరిన నేపథ్యంలో వారిని దీటుగా ఎదుర్కొనేందుకు రాధా వంటి వారి సేవలు అవసరమని ఆ పార్టీల ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఇద్దరు నాయకులూ ఈ అంశాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాము మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నారు. వారు అలా చెబుతున్నప్పటికీ కచ్చితంగా రాజకీయ అంశాలు ఉంటాయనే టాక్ వినపడుతోంది. రాధా జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.