Vangaveeti Radha : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కొత్త సామాజిక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంప్ జిలానీలు అవుతున్నారు. ఇక సైలంట్ గా ఉంటున్న నేతలు కూడా యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నారు.
సామాజిక సమీకరణాల పరంగా జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదనే చెప్పాలి. కమ్మ-కాపు సామాజిక సమీకరణాలతో వెళ్తున్న టీడీపీ, జనసేనలకు అదే సామాజిక సమీకరణాలతో చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇక ముద్రగడ జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికర రాజకీయానికి జగన్ తెర తీశారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీ ఎన్నికల వేళ కాపు సామాజిక వర్గం కీలకం కావడంతో.. ఆ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే టీడీపీ-జనసేన ఏకమై తనను ఓడించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అవే సామాజిక సమీకరణాలతోనే చెక్ పెట్టాలని జగన్ భావిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లోని ముద్రగడ జనసేన వైపు చూస్తుండగా.. కృష్ణా జిల్లాలో కాపు నాయకుడు వంగవీటి రాధాతో వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో రాధా టీడీపీలో చేరినా.. అంత యాక్టివ్ గా లేరు. జనసేనలో చేరాలని కూడా ఆయనకు ఆహ్వానం అందింది.
దీంతో రాధా ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో వైసీపీలో చేరితే మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చేలా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ నుంచి కమ్మ నాయకుడు కేశినేని నానికి టికెట్ ఖరారు చేశారు. ఇక మచిలీపట్నం నుంచి కాపు నాయకుడిని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. దీంతో రాధాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రాధా ముందుకొస్తే 4వ జాబితాలో మచిలీపట్నం ఖరారు అవుతుందని సమాచారం. అయితే ఇక్కడ సిట్టింగ్ బాలశౌరి వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.
కాగా, 2019లో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమా, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇవ్వడం దాదాపు ఖరారైంది. ఈక్రమంలో రాధాను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన. దీనిపై ఈరోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఉండడంతో రాధా పోటీ చేయడం ద్వారా వైసీపీకి కలిసివస్తుందని అంచనా. దీంతో రాధా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.