Vangaveeti Radha : కూటమికి మద్దతుగా ‘వంగవీటి’ ప్రచారం
Vangaveeti Radha : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ మేరకు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు పలువురు సెలబ్రిటీలను కూడా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం జనాల నాడీని బట్టి రాష్ట్రంలో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రచారంతో ప్రజల్లో కూటమికి అనుకూలమైన వేవ్ కనపడుతోంది. ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధి, రాజధాని విషయమై యువత జగన్ పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రచారానికి పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. వంగవీటి రాధా కూడా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. గతంలో కాంగ్రెస్, పీఆర్పీ, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
సీట్ల సర్దుబాటులో బిజీగా ఉండడంతో వంగవీటికి ఎక్కడ సీటు రాలేదు. ఆయన కోరితే బాబు ఎక్కడో ఓ చోట సీటు ఇచ్చేవారే. కానీ పోటీకి ఆయన విముఖంగా ఉండడంతో పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆయనతో ప్రచారం చేయిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఎన్డీయే కూటమి తరఫున వంగవీటి ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
ఆయన పోటీ చేయకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. కాపులు, బలిజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి ప్రచారం చేస్తున్నారు. రాధా పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అమరావతి పోరాటంలో రైతులకు వంగవీటి అండగా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి దిగిన ఫొటోలు మీడియాకు లీకు చేస్తూ వైసీపీలో వంగవీటి చేరుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు జగన్ సర్కారు ఇచ్చిన ఆఫర్లు కాదని టీడీపీకే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపులో వంగవీటి ప్రధాన పాత్ర పోషించబోతున్నారని చెబుతున్నారు.