MP Vamsikrishna : పెద్దపల్లి నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రైల్వే జీఎంను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోరారు. మంగళవారం (అక్టోబరు 8, 2024) హైదరాబాద్ లో రైల్వే జీఎంను వారు కలిసి పలు ప్రతిపాదనలు చేశారు. జీఎంతో భేటీ అనంతరం ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి ప్రాంతానికి కొత్త రైల్వే స్టేషన్స్, రైల్వే స్టేషన్ల రినోవేషన్, కరోనా టైంలో ఆపేసిన రైల్వే స్టాప్స్ తిరిగి ప్రారంభించాలని జీఎంను కోరినట్లు తెలిపారు.
కేరళ ఎక్స్ ప్రెస్ కు మంచిర్యాలలో స్టాప్ ఏర్పాటు చేయాలని, వందే భారత్ ట్రైన్ కు పెద్దపల్లిలో, రామగిరి ఎక్స్ ప్రెస్ కు మందమర్రిలో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వంశీకృష్ణ తెలిపారు. పెద్దపల్లి ప్రాంతం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, పెద్దపల్లి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో కొత్త రైల్వే స్టాప్స్, ట్రాక్స్ ఏర్పాటు చేస్తే వ్యాపారం పరంగా కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెద్దపల్లిలోని అన్ని నియోజకవర్గాలకు రైల్వే కనెక్టివిటీని ఉండేలా చేయాలనీ జీఎంను కోరామని, తమ ప్రతిపాదనలకు రైల్వే జీఎం కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని, కొత్త స్టాప్స్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.