Vallabhaneni Vamsi : ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు రసకందాయకంలో పడుతున్నాయి. రసవత్తర పోరు కొనసాగుతోంది. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటోంది. అత్యధిక సార్లు ఇక్కడ నుంచి టీడీపీ విజయం సాధించడం గమనార్హం.
2014-2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో బయటపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ ఈసారి వైసీపీ నుంచి పోటీలో నిలిచారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు.
వల్లభనేని వంశీ చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభలోనే కంటనీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. గన్నవరంలో రెండు పార్టీల మధ్య ఆసక్తికర పోరు కొనసాగనుందని తెలుస్తోంది. మాదంటే మాదే విజయం అని టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయి. రెండు పార్టీలకు గెలుపు ఆవశ్యకమని తెలుస్తోంది. తమ జెండా ఎగరేయాలని చూస్తున్నాయి.
2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. వంశీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. టీడీపీ సత్తా కన్నా వంశీ వ్యక్తిగత ఇమేజ్ అధికంగా ఉండడంతో ఇక్కడ పోరు ఉత్కంఠగా సాగుతోంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతోనే బయట పడడం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అనే ధోరణిలోనే పోరాటం చేస్తున్నాయి.
ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ పట్టు కోసం టీడీపీ పట్టుబట్టడం సహజమే. వైసీపీని ఓడించడమే ప్రధానంగా ముందుకు వెళ్తున్నారు. సర్వశక్తులు ఒడ్డి టీడీపీ విజయం కోసం బాటలు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని చెబుతున్నారు.