Uttarandhra Survey : మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఏపీ పార్టీలు స్పీడ్ పెంచాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి క్షేత్రస్థాయి ప్రచారం మొదలుపెట్టింది. ఇక టీడీపీ, జనసేన కూటమి బీజేపీని తమతో కలుపుకునే ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. రేపోమాపో దీనిపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా జనాల నాడీని పట్టేందుకు పలు సర్వే సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడించాయి. ఇందులో కొన్ని అధికార వైసీపీదే అధికారమని, మరికొన్ని టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేస్తాయని పేర్కొన్నాయి. దీంతో ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాష్ట్రంలో రాయలసీమలో వైసీపీకి, మిడిల్ కోస్తాలో టీడీపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉంటుందన్న ప్రస్తుత అంచనాలు ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర ఎవరి వైపు మొగ్గుచూపుతుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తరాంధ్ర రాజకీయ ముఖ చిత్రం మారుతున్నట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో నూటికి 80శాతానికిపైగా సీట్లను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి వైసీపీకి గట్టి పోటీని ఇస్తున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖలో నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి మారుతోంది.
ఉమ్మడి శ్రీకాకుళం :
ఈ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో చెరి ఐదు సీట్లలో ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. వైసీపీ ఆధిక్యత ఉన్న సీట్లలో శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, పలాస ఉంటే టీడీపీ, జనసేన కూటమికి టెక్కలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్లలో మొగ్గు కనిపిస్తోంది. అయితే ఇందులో అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఖరారై బరిలోకి దిగిన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఉమ్మడి విజయనగరం :
ఇక్కడ మొత్తం 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో ఈ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం టీడీపీకి కొంత మొగ్గు కనిపిస్తోంది. అధికార వైసీపీకి ఈ జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోటలో టీడీపీ, జనసేన కూటమికి గట్టిపోటీ ఇస్తున్నాయి. ఇందులో బొబ్బిలి, విజయనగరం సీట్లు రాజులవి కావడం విశేషం.
ఉమ్మడి విశాఖ :
ఈ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ సిటీ పరిధిలో నాలుగు ఉంటే విశాఖ రూరల్ జిల్లాలో 9, ఏజెన్సీలో 2 ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో వైసీపీ 7 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 8 సీట్లలో ఆధిక్యత కనిపిస్తోంది. విశాఖ సిటీలో విశాఖ సౌత్, విశాఖ నార్త్ వైసీపీకి మొగ్గుచూపితే, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ మరోమారు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి ఆధిక్యత కనిపిస్తోంది. వైసీపీకి చోడవరం, పాయకరావుపేట, మాడుగులతో పాటు ఏజెన్సీలోని అరకు, పాడేరులో మొగ్గు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే విశాఖ జిల్లాలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ తప్పదు అనిపిస్తోంది.
ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 18, టీడీపీ కూటమికి 16 సీట్ల దాక వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసివస్తే మరింత హోరాహోరీ ఉండనుంది. ఓవరాల్ గా చూస్తే ఉత్తరాంధ్రలో ఈసారి టఫ్ ఫైట్ తప్పేలా లేదు.