Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొవిడ్ పాజిటివ్
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొవిడ్-19 బారినపడ్డారు. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ ప్రస్తుతం స్వల్ప దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర్ లో సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారని, అక్కడే కొవిడ్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీనితో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం లాస్ వెగాస్ లో జరిగే యూనిడోస్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడాల్సి ఉంది. మంగళవారం బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే, అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగుతానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం గమనార్హం.