UPI : నేటి నుంచి అమల్లోకి వచ్చిన యూపీఐ, మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఇవే..!!

UPI : ప్రతి నెలా మొదటి తేదీ నుంచి ఆర్థికపరమైన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ ఖాతాల్లోని కనీస నిల్వలు, ఏటీఎం లావాదేవీల రుసుములకు సంబంధించిన ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.

యూపీఐలో భద్రతా మార్పులు:

యూపీఐ చెల్లింపుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్పులు చేసింది. ఇకపై డీయాక్టివేట్ అయిన మొబైల్ నంబర్లకు లింక్ చేసిన యూపీఐ ఐడీలను తొలగించనున్నారు. అలాగే, చాలా కాలంగా యూపీఐ లావాదేవీల కోసం తమ మొబైల్ నంబర్‌ను ఉపయోగించని వినియోగదారులు తమ బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ యాప్‌లు కూడా వినియోగంలో లేని నంబర్‌లను దశలవారీగా తొలగించాలని NPCI ఆదేశించింది. ఈ చర్యలన్నీ యూపీఐ ఐడీల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్నారు.

కనీస నిల్వలపై బ్యాంకుల నిర్ణయం:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో కనీసం ఉంచాల్సిన నిల్వ పరిమితులను మార్చాయి. ఈ నిబంధనలను పాటించని ఖాతాదారుల నుంచి బ్యాంకులు జరిమానా విధిస్తాయి. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకుల కొత్త నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.

ఏటీఎం లావాదేవీల రుసుముల్లో మార్పులు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం లావాదేవీల రుసుములకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు నెలకు అనుమతించే ఉచిత ఏటీఎం ఉపసంహరణల సంఖ్య తగ్గింది. ఇకపై వినియోగదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు కేవలం మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, తమ బ్యాంకులు మరియు యూపీఐ ఖాతాలకు సంబంధించిన కొత్త నిబంధనలను తెలుసుకోవడం మంచిది.

TAGS