Upendra Dwivedi : కొత్త ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్ర ద్వివేది
Upendra Dwivedi : భారత 30వ ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే పదవీ విరమణ చేయనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ జూన్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఈరోజుతో పాండే పదవీకాలం ముగిసింది. రక్షణ శాఖ కార్యాలయంలో చివరి రోజున మనోజ్ పాండే గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో భారత సైన్యానికి వైస్ చీఫ్ అదేవిధంగా ఉత్తర సైన్యానికి కూడా నాయకత్వం వహించాడు.
జులై 1, 1964న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ ద్వివేది జన్మించారు. మధ్యప్రదేశ్ లోని రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలీజేలో స్కూల్, కాలేజీ విద్య పూర్తి చేశారు. అమెరికా ఆర్మీ వార్ కాలేజీలోనూ చదివారు. డిఫెన్స్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంఫిల్, స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ మిలిటరీ సైన్స్ లో రెండు మాస్టర్ డిగ్రీలు కూడా చేశారు. ఆర్మీ ఇన్ఫాంట్రీ (జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్)లో 1984, డిసెంబర్ 15న చేరారు. ఆర్మీలో 40 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో అనేక హోదాల్లో పని చేశారు.
రెజిమెంట్ కమాండ్, బ్రిగేడ్, అస్సాం రైఫిల్స్ డీఐజీ వంటి పదవులు నిర్వర్తించారు. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఇన్ఫాంట్రీ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు నార్తర్న్ కమాండ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఆర్మీ వైస్ చీఫ్ గా నియమితులయ్యారు. ఆయన పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం వంటి అవార్డులను పొందారు.