Farmers Protest in Delhi : ఆరుగాలం కష్టపడి పంటను తీసి పది మందికి అన్నం పెడుతున్న అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పంటకు మద్దతు ధర కోసం ఢిల్లీపై పోరు సాగిస్తున్నాడు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ చేరుకునేందుకు రెండో రోజైన బుధవారం(నిన్న) వారు ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేలాది మంది మోహరించారు. పంజాబ్ లోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది.
రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లను, ముళ్ల కంచెలను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను కట్టదిట్టం చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కివెళ్లే పరిస్థితి లేదని రైతులు తేల్చిచెబుతున్నారు.అయితే రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండాతో పాటు ఇతర సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. సమావేశ వివరాలు వెల్లడి కాలేదు. ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం రైతు నేతలతో చండీగఢ్ లో సమావేశం కానున్నారు. మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానంద రాయ్ పాల్గొనే ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకు జరుగనుందని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు. ఇది మూడో విడత సమావేశమని చెప్పారు.
కాగా, రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ తో పాటు హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీ చలో ఆందోళన సందర్భంగా గాయపడిన రైతు గుర్మీత్ సింగ్ తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడారు. దేశంలోని అన్నదాతలపై మోదీ సర్కార్ నియంతృత్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు.