BRS-Congress : తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్వరాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పదేళ్ల పాటు పాలించింది. ఈ క్రమంలో తెలంగాణ అంటే తామేనని స్వయంగా ప్రకటించుకున్నారు. కాని పదేళ్ల తర్వాత పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోగా, తెలంగాణ పాలన హస్తగతమైంది. ఇక సీఎం రేవంత్ కేసీఆర్ ముద్రను మార్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుగా టీఎస్ అనే మార్పుతో తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను మరిపించే ప్రయత్నాలకు కార్యాచరణ షురూ చేశారు.
విగ్రహం నుంచి మొదలు
తెలంగాణ తల్లి విగ్రహ రూపం కేసీఆర్ కూతురు కవితను పోలి ఉందని ముందు నుంచే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నది తానే కాబట్టి కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పనకు పురమాయించారు. పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ ఇప్పటికే చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. పలు మార్పులతో కొత్త చిహ్నం తయారు చేయిస్తున్నారు. రాచరిక పోకడల్ని తీసేస్తామని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
కాకతీయ కళాతోరణం కూడా రాచరిక పోకడగానే చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ చిహ్నంలో ఉన్న ఆ తోరణాన్ని తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ నేతలు.. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంలోనుంచి తీసేసే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే అందెశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించి సోనియాచేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ గేయానికి సంగీతం అందిస్తున్నారు.
ఇదంతా గమనిస్తుంటే తెలంగాణ ఇచ్చింది.. కాంగ్రెస్… కాబట్టి ఆ పార్టీ ముద్ర మాత్రమే ఉండేలా రేవంత్ నిర్ణయాలు ఉంటున్నాయి. దీన్ని కౌంటర్ చేసే పరిస్థితులు మాత్రం బీఆర్ఎస్ నుంచి కానరావడం లేదు.