Land Registrations : తెలియకుండానే భూములు చేతులు మారుతున్నయ్..కారణం ఇదే..
Land Registrations : తెలంగాణలో ధరణి పోర్టల్ ను ఉపయోగించుకుని అక్రమార్కులు దగా చేస్తున్నారు. 2020 అక్టోబర్ 29కి ముందు ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత భూమి దస్తావేజులను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు. అనంతరం ఆ దస్త్రాన్ని రెవెన్యూ శాఖకు పంపితే తహసీల్దార్ కార్యాలయం పది రోజుల్లోపు మ్యుటేషన్ (రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల మార్పిడి) ప్రక్రియను ఉచితంగా చేపట్టేది. క్షేత్రస్థాయిలో విచారించి.. మ్యుటేషన్ పూర్తి చేసి..పాస్ పుస్తకం జారీ చేసేది.
2020 నవంబర్ 2 నుంచి ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. తహసీల్దార్/సంయుక్త సబ్ రిజిస్ట్రార్ వద్ద ఏకకాలంలో రిజిస్ట్రేషన్/ మ్యుటేషన్ పూర్తి చేస్తున్నారు. మీసేవా కేంద్రంలో సదరు భూమికి సంబంధించి ఆ సర్వే నంబర్ లోని మార్కెట్ ధర చెల్లించి, ఎకరాకు మ్యుటేషన్ ఫీజు రూ.2 వేలు చెల్లించి.. కేటాయించిన స్లాట్ సమయానికి తహసీల్దార్ కార్యక్రమానికి వెళ్తే క్షణాల వ్యవధిలో లావాదేవీ పూర్తవుతోంది. క్షేత్రస్థాయిలో విచారణేమి చేయకపోవడంతో అక్రమాలకు తావిస్తోంది. దీంతో ఒకరి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా మరొకరిపై మార్పిడి చేస్తున్న ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్/ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రూ.కోట్ల విలువ చేసే ఆ భూమి యజమానికి ఇష్టం లేకపోవడంతో అతడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం కనీసం అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. ఇందుకు సాంకేతికత, నిబంధనల్లోని లొసుగులే కారణమని అంటున్నారు. ధరణిలో లోపాలతోనే ఇలా చేస్తున్నారని.. కచ్చితంగా మార్పులు చేయాలని భూ యజమానులు కోరుతున్నారు.