Cooking Gas eKYC : గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీంతో ఎల్ పీజీ కంపెనీలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై తాజాగా కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీకీ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. అంతేగాక, దీని నమోదుకు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఎల్ పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధన ఏదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని తెలిపారు.