Nirmala Sitaraman : రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల భేటీ
Nirmala Sitaraman : బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ సంప్రదింపులు జరిపారు.
వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నిన్న ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రకటించింది. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 53వ సమావేశం జరగనుంది. చివరిసారిగా జీఎస్టీ మండలి 2023 అక్టోబరు 7న భేటీ కాగా.. దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ సమావేశం కానుంది. ఆన్ లైన్ గేమింగ్ రంగానికి 28% జీఎస్టీ అమలుపై ఇందులో ప్రధానంగా సమీక్షించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, జౌళి, ఎరువులకు ఇన్వర్టెడ్ సుంకం (తుది ఉత్పత్తిపై కంటే ముడి సరకు పైనే పన్ను రేట్లు ఎక్కవగా ఉండటం) అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.