Hardik Pandya : ముంబై ఇండియన్స్ జట్టులో వరుస ఓటములకు అంతర్గతంగా అసంతృప్తులే కారణమని సమాచారం. కొందరు సీనియర్ ఆటగాళ్లు.. డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి, హార్దిక్ నాయకత్వంతో ఇబ్బందులను కోచ్ లకు వెల్లడించినట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనంలో తెలిపింది. ఎంఐ మొత్తం 12 మ్యాచులు ఆడితే 8 ఓడిపోయి ఎలిమినేటైన తొలి జట్టుగా నిలిచింది. రోహిత్ నాయకత్వంలో పదేళ్లు ఆడిన జట్టు.. హార్దిక్ శైలికి ఇంకా అలవాటు పడినట్లు లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్ సైతం సైలెంట్ అయ్యేందుకు కొత్త కెప్టెన్ శైలే కారణమని సీనియర్లు.. కోచ్ బృందానికి వివరించారు.
ఇటీవల ఒక మ్యాచ్ సందర్భంగా ముంబై ఆటగాళ్లు, జట్టు కోచింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. దీనిలో సూర్య, రోహిత్, బుమ్రా తదితర సీనియర్లు పాల్గొన్నారు. జట్టు సరిగ్గా ప్రదర్శన ఇవ్వకపోవడంపై భోజనాల సమయంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ తర్వాత సీనియర్లు, జట్టు మేనేజ్‌మెంట్ బృందంతో ఒక్కొక్కరిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై ముంబై జట్టు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘రోహిత్ నాయకత్వంలో పదేళ్లు ఆడిన జట్టు కొత్త నాయకత్వ మార్పునకు అలవాటు పడలేదు. ఎక్కడైనా వచ్చే బాలారిష్టాలాంటివే ఇవి కూడా’ అని వ్యాఖ్యానించారు.
తిలక్ వర్మపై నిందలతో వివాదం..
ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓటమికి సంబంధించి టాప్ స్కోరర్ తిలక్ వర్మను హార్దిక్ తప్పుపట్టాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడికి మ్యాచ్ పరిస్థితి అవగాహన లేకపోవడమే ఓటమికి కారణమని హార్దిక్ వ్యాఖ్యానించాడు. ‘అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్ తిలక్ బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ లో తిలక్ దూకుడుగా ఆడి ఉండాల్సింది. ఈ అవగాహన లోపించడంతో మూల్యం చెల్లించుకున్నాం’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ 32 బంతుల్లో 63 రన్స్ చేశాడు.
ఓటమిని ఏక పక్షంగా తనపై నెట్టేయడంతో తిలక్ వర్మ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తిలక్ డ్రెస్సింగ్ రూమ్‌లో హార్దిక్ వద్ద ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. దీని విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు ప్రచారం.
జట్టులో వర్గాలున్నట్లు కనిపిస్తోంది: క్లార్క్
ముంబై జట్టుపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ క్లార్క్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. వారి ఆటతీరు చూస్తుంటే వర్గాలుగా విడిపోయినట్లు అనిపిస్తుంది. ‘ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా గ్రూపులు ఉన్నట్లు భావిస్తున్నా. వారు సమిష్టిగా లేరు. ఓ జట్టులాగా ఆడడం లేదు’ అని అన్నాడు.