Electricity Consumption : అనూహ్యంగా పెరిగిన విద్యుత్ వినియోగం
Electricity Consumption: హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 3న (శుక్రవారం) అత్యధికంగా 89.71 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైందన్నారు. గత ఏడాది ఇదేరోజు 58.34 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఇది 53.7 శాతం అధికమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 2న 228.50 మి.యూ. వినియోగం నమోదైందని గత ఏడాది ఇదేరోజు (151.71 మి.యూ.)తో పోలిస్తే ఇది 50.62 శాతం అదనమని వివరించారు.
ఈ నెల ముగిసేవరకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందన్నారు. వేసవి డిమాండ్ నేపథ్యంలో అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు, మరో 250 ట్రాన్స్ ఫార్మర్లను క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు సీఎండీ వివరించారు.