Chandrababu : బీజేపీ ఊహించని ఫలితాలు.. జాతీయ స్థాయిలో చంద్రబాబు కింగ్ మేకర్ కాబోతున్నారా?
Chandrababu : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దుమ్మురేపి, మూడో సారి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతలకు షాకిస్తున్న ఓటర్లు. ప్రధాని మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారని, 400 సీట్లు పక్కా అని బీజేపీ నేతలు అంచనా వేశారు. తీరా ఫలితాల సరళిని చూస్తే ఇండియా కూటమి కూడా భారీగానే సీట్లు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి.
ఊహించిన దానికంటే భిన్నంగా ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి 291, ఇండియా కూటమి 210 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, సొంతంగా ఏర్పాటు చేసే పరిస్థితులు కనపడడం లేదు. మిత్రపక్షాలు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం అయిపోయింది.
ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలో ఇప్పుడు టీడీపీ కీలకం. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ గణనీయ స్థాయిలో సీట్లను దక్కించుకునే దిశగా ముందుకెళ్తోంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయితే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పడం ఖాయం. ఇక బీజేపీ ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. గతంలో ఒంటరిగానే అధికారంలోకి రావడంతో మోదీకి తిరుగులేకుండా ఉండేది. ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు మాత్రమే అధికారం చేపడితే మోదీ దూకుడుకు కాస్త బ్రేక్ పడే అవకాశాలే ఉన్నాయి. సీనియర్ నేత చంద్రబాబు మరోసారి ఢిల్లీ స్థాయిలో కీలకం కాబోతున్నారు.