CM Revanth Reddy : నిరుద్యోగులు నిరసనలు చేయవద్దని.. మీకు అన్నగా అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని, గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్ లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
‘‘పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న అందరికీ నా అభినందనలు. ఈ క్షణంలో మీ తల్లిదండ్రుల గుండె ఉప్పొంగుతుంది. మీది జీతభత్యాల కోసం చేసే ఉద్యోగం కాదు. విపత్తును జయించే సామాజిక బాధ్యత. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఉన్నతాధికారులను కలవండి. మీ రేవంత్ అన్నగా మీ కోసం నేను అండగా ఉంటా. గ్రామాల్లో యువకులు తల్లిదండ్రులను సరిగా చూడడం లేదని నా దృష్టికి వస్తోంది. దయచేసి మీకు రెక్కలు వచ్చాక, కుటుంబాన్ని విడిచి వెళ్లవద్దని కోరుతున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.