Under 19 World Cup : ప్రతీకారం తీర్చుకునే సమయమిదే.. దెబ్బకు కంగారూల కూసాలు కదిలిపోవాలి..

Under 19 World Cup

Under 19 World Cup, Team India VS Australia

Under 19 World Cup : ప్రపంచంలో భారత జట్టును నిలువరించే జట్టు ఏదన్నా ఉందంటే అది ఆస్ట్రేలియానే. ఎందుకో మన వాళ్లు అన్ని జట్లతో అదుర్స్ అనిపించినా, కీలక మ్యాచ్ ల్లో ఆసిస్ దగ్గర చేతులెత్తేస్తారు. ఇది ఎన్నో సార్లు జరిగిందనే చెప్పాలి. అందుకే భారత క్రికెట్ అభిమానులకు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ అంటేనే ఏదో మూలన మనసులో శంఖ మొదలవుతుంది.

గతంలో 2004లో వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియాను ఓడించి కప్ ఎగురవేసుకుపోయింది. నిరుడు సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ లోనూ భారత్ ఆశలను కల్లలు చేశారు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు. కీలక టోర్నీల్లో ఫైనల్లో మనతో తలపడుతున్న కంగారూ జట్టు మన ఆటగాళ్లను ఎంతో కలవరపెడుతోంది.

ఇప్పుడు తాజాగా మన కుర్రాళ్ల రూపంలో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే సమయమొచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ ఆ జట్టే మనకు ప్రత్యర్థి అయ్యింది. గురువారం(నిన్న) పాకిస్తాన్ తో జరిగిన సెమీస్ లో ఆసీస్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. టామ్ స్ట్రూకర్ (6/24), డిక్సన్ (50, 75 బంతుల్లో) ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడబోతోంది. సీనియర్ల వల్ల కానిది జూనియర్ల వల్ల అవుతుందా అనే సంశయాలు ఉండనక్కర్లేదు. అండర్-19లో మన టీమిండియా కుర్రాళ్ల జోరే ఎక్కువ. ఈ టోర్నీలో 9 సార్లు ఫైనల్ కు చేరిన ఘనత మనది. అలాగే ఐదు సార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది. 2018లోనూ, 2022లోనూ మనదే కప్. మన ట్రాక్ రికార్డులు బాగానే ఉన్నాయి.

కాగా, ఇప్పటి కుర్రాళ్లలో అదిరిపోయే ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్ మంచి ఊపుమీదున్నారు. అన్ని రంగాల్లో మనవాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇక ఫైనల్ లో మనమే టైటిల్ ఫేవరేట్ దిగుతున్నాం. సీనియర్లను కట్టడి చేసిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని జూనియర్లకు అభిమానులు సూచిస్తున్నారు. ఇక నుంచి ఫైనల్ అంటే ఇలా ఉంటుందని..ఫైనల్  ఓటమి రుచి ఇలా ఉంటుందని కంగారూలకు టేస్ట్ చూపించాల్సిందే.

TAGS