Under 19 World Cup Final : కంగారూలకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాల్సిందే!
Under 19 World Cup Final Match : భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్-19 వరల్డ్ కప్ -2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు పోటీపడనున్నాయి. గతంలో 2004లో వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియాను ఓడించి కప్ ఎగురవేసుకుపోయింది. నిరుడు సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ లోనూ, డబ్ల్యూటీసీలోనూ భారత్ ఆశలను కల్లలు చేశారు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు. కీలక టోర్నీల్లో ఫైనల్లో మనతో తలపడుతున్న కంగారూ జట్టు మన ఆటగాళ్లను ఎంతో కలవరపెడుతోంది.
ఇప్పుడు తాజాగా మన కుర్రాళ్ల రూపంలో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే సమయమొచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ ఆ జట్టే మనకు ప్రత్యర్థి అయ్యింది. గురువారం పాకిస్తాన్ తో జరిగిన సెమీస్ లో ఆసీస్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. టామ్ స్ట్రూకర్ (6/24), డిక్సన్ (50, 75 బంతుల్లో) ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడబోతోంది. సీనియర్ల వల్ల కానిది జూనియర్ల వల్ల అవుతుందా అనే సంశయాలు ఉండనక్కర్లేదు. అండర్-19లో మన టీమిండియా కుర్రాళ్ల జోరే ఎక్కువ. ఈ టోర్నీలో 9 సార్లు ఫైనల్ కు చేరిన ఘనత మనది. అలాగే ఐదు సార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది. 2018లోనూ, 2022లోనూ మనదే కప్. మన ట్రాక్ రికార్డులు బాగానే ఉన్నాయి.
కాగా, ఇప్పటి కుర్రాళ్లలో అదిరిపోయే ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్ మంచి ఊపుమీదున్నారు. అన్ని రంగాల్లో మనవాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇక ఫైనల్ లో మనమే టైటిల్ ఫేవరేట్ దిగుతున్నాం. సీనియర్లను కట్టడి చేసిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని జూనియర్లకు అభిమానులు సూచిస్తున్నారు. ఇక నుంచి ఫైనల్ అంటే ఇలా ఉంటుందని..ఫైనల్ ఓటమి రుచి ఇలా ఉంటుందని కంగారూలకు టేస్ట్ చూపించాల్సిందే. దీని కోసం ఎంతగానో భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి కుర్రాళ్లు మీకు బెస్టాఫ్ లక్..