Pakistan Cricket : అల్లుడి కేప్టెన్సీ పోయిందని మామ సంబురం.. వైరల్ అవుతున్న రియాక్షన్.. ఆ సిరీస్ ఓడిపోయినందుకే అంటూ కామెంట్..

Pakistan Cricket

Pakistan Cricket

Pakistan Cricket : గతేడాది (2023) భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టు పేలవమైన ప్రదర్శననే కనబర్చింది. బాబర్ ఆజామ్ కేప్టెన్ నుంచి తప్పుకోగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాన్ మసూద్‌కు టెస్ట్, షాహీన్ అఫ్రిదీకి టీ20 బాధ్యతలను అప్పగించింది. పీసీబీ ఆదివారం (మార్చి 31) మరో కీల‌క నిర్ణయం తీసుకుంది. వైట్‌బాల్ కెప్టెన్‌గా మ‌ళ్లీ బాబ‌ర్ నే తిరిగి నియ‌మించింది. వ‌న్డేలు, టీ20ల్లో జట్టును బాబ‌ర్ న‌డిపించ‌నున్నాడు.

షాహీన్ కేప్టెన్సీలో జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌తో 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాక్ వ‌రుస ఓట‌ముల‌ను చ‌విచూసింది. 1-4 తేడాతో సిరీస్‌ పై ఆది నుంచే పట్టు కోల్పోయింది. దీంతో షాహీన్ అఫ్రిదీ కెప్టెన్సీ ఒక్క సిరీస్‌కే పరిమితం చేసింది పాక్ బోర్డు. కెప్టెన్సీ మార్పుపై పాక్ జ‌ట్టు మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. పీసీబీ నిర్ణయంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించాడు. వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్‌కు ప‌గ్గాలు అప్పగిస్తే బాగుండేద‌ని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘సెలక్షన్ కమిటీలో అనుభవజ్ఞులైన వారు ఉన్నారు. వీరి నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్‌ను మార్చాల‌ని అనుకుంటే రిజ్వాన్ మాత్రమే దానికి అర్హుడు. అయినా.. పీసీబీ నిర్ణయాన్ని శిరసావహిస్తా.. కెప్టెన్‌గా నియ‌మితులైన బాబ‌ర్ ఆజామ్‌కు శుభాకాంక్షలు’ అని షాహిద్ అఫ్రిదీ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

షాహిద్ అఫ్రిదీ త‌న కూతురిని పేస‌ర్ షాహిద్ అఫ్రిదికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే.. షాహిన్‌కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని మొద‌టి నుంచి షాహిద్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. టీ20 కెప్టెన్‌గా షాహిన్ పేరు అనౌన్స్ చేసిన స‌మ‌యంలో బహిరంగంగానే త‌న నిర్ణయం చెప్పాడు. అత‌నికి కెప్టెన్సీ ఇవ్వడం కన్నా మహ్మద్ రిజ్వాన్‌కు అప్పగించాలని టీవీ చ‌ర్చా కార్యక్రమాల్లో అన్నాడు.

ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన కెప్టెన్సీ నుంచి తొల‌గిస్తారా అని షాహిన్ అభిమానులు పీసీబీపై మండిప‌డుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌ లాహోర్ ఖలందర్స్‌ను సమర్థంగా నడిపించడంలో షాహిన్ విఫ‌లమయ్యాడు. దీంతో లాహోర్ ఖ‌లంద‌ర్స్ ఈ సీజ‌న్‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకోవ‌డంలో విఫ‌లమవడం, వ్యక్తి గత ఆటతీరు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం లాంటి అంశాల‌ను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TAGS