US President : కొందరికీ చమత్కారం ఎక్కువ. సందర్భోచితంగా హాస్యం పండించడం, సీరియస్ ఇష్యూలోనూ హాస్యం చొప్పించి మెప్పించడం కొందరికే చెల్లుతుంది. ఇక రాజకీయ నాయకుల్లో ఇది ఎక్కువ. నిత్యం ప్రసంగాలతో తలపండిపోతారు కనుక వారి నోటి వెంట పంచ్ లు, ప్రాసలు, చమత్కారాలు కామన్ గా వస్తూనే ఉంటాయి. ఇక పాశ్చాత్య దేశాల అధినేతలకు ఇది మరీ ఎక్కువ. హాస్యానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఎప్పుడు సీరియస్ గా కనపడే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లో కూడా హాస్యచతురత బాగానే ఉంది. తాజాగా ఆయన చమత్కారంలో కూడా హుందాతనాన్ని ప్రదర్శించారు.
తన బోయింగ్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ తలుపు వద్ద తాను కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇటీవల బోయింగ్ సంస్థకు చెందిన విమానాల్లో వెలుగు చూస్తున్న ఘటనలను ఉద్దేశించి ఆయన చమత్కరించారు.
ఒక టాక్ షో వ్యాఖ్యాత బైడెన్ తో మాట్లాడుతూ..‘‘ మీరు న్యూయార్క్ సిటీకి బయల్దేరేముందు మీ రవాణా శాఖ మంత్రి ఎయిర్ ఫోర్స్ వన్ బోల్టులు బిగించారా? అంటూ ప్రశ్నించారు. ఇందుకు అధ్యక్షుడు బదులిస్తూ.. ‘‘నేను తలుపు పక్కన కూర్చోను. జస్ట్ జోక్ చేస్తున్నాను. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
కొద్ది నెలల క్రితం అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్ లాండ్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరింది. 171 మంది ఆ సమయంలో ప్రయాణిస్తున్నారు. విమానం 16,000 అడుగుల ఎత్తుకు చేరగానే..ఎడమ వైపున్న తలుపు ఊడిపోయింది. దాని పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. అయితే విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
బోయింగ్ సంస్థ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటోంది. దీంతో కంపెనీపై నియంత్రణ సంస్థల నిఘా మరింత ఎక్కువైంది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు తీవ్రతరం కావడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి.