Udayanidhi : మరోసారి ఉదయనిధి సంచలనం..ఈ సారి రామమందిరంపై..ఇక దుమారమే..

Udayanidhi

Udayanidhi

Udayanidhi : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశం యావత్తూ సిద్ధమైంది. అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు ఇప్పటికే అందించారు.  కోట్లాది హిందువుల శతాబ్దాల కల నెరవేరే రోజు కోసం సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వేడుకకు మరో మూడు రోజులే ఉండడంతో దీనిపై పలువురు వివిధ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయంపై ఉదయనిధి చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్నే వ్యతిరేకిస్తున్నామన్నారు. డీఎంకే పార్టీ కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. కరుణానిధి కూడా ఇదే విషయం చెప్పేవారన్నారు. ఆధ్యాత్మికతను రాజకీయాలతో ముడిపెట్టడం మంచిది కాదన్నారు. రామ మందిర నిర్మాణంతో తమకే సమస్య లేదని, అక్కడ ఉన్న మసీదును ధ్వంసం చేసి మందిరాన్ని నిర్మించడమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు.

గతంలో ఉదయనిధి సనాతన ధర్మంపై కూడా వివాదస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సనాతనాన్ని వ్యతిరేకించడమే కాదు.. నిర్మూలించాలని ఆయన చెప్పారు. డెంగీ, మలేరియా, దోమలు, కరోనా వైరస్ ను ఏ విధంగా రూపుమాపాల్సిన అవసరం ఉందో అదే విధంగా సనాతనాన్ని కూడా రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై అప్పట్లో దుమారమే రేగింది.

కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ, హిందూ సంఘాలు, భక్తులు ఆ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉండగా..పలువురు విమర్శల పర్వానికి దారితీస్తున్నారు. ఈ వేడుక హిందువులందరిదని, కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సొంత కార్యక్రమంగా నిర్వహించడంతోనే తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చెపుతున్నారు. అలాగే ఇంకా రామమందిర నిర్మాణం పూర్తి కాలేదని, సగం నిర్మాణం అయిన ఆలయంలో పూజలు ఎలా చేస్తారని కొందరు విమర్శిస్తున్నారు. ఇలా రామాలయ వివాదం బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టుగా సాగుతోంది.

TAGS