Weather Alert : బంగాళాఖాతంలో తుఫాన్..? – ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Weather Alert

Weather Alert

Weather Alert : బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అది 24వ తేదీ వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు వేసవి ఎండల నుండి కాస్త ఉపశమనం లభించింది. గత కొద్ది రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిన జనాలు వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు.  ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో ఈ నెల 23 వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ఇవి చురుగ్గా కదులుతున్నాయని, రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

TAGS