CM Revanth : రేవంత్ రెడ్డి.. తెలంగాణ రెండో సీఎం అవుతారని ఆయన కూడా నమ్మలేదు కాబోలు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఒకవేళ వచ్చినా రేవంత్ ను సీనియర్లు సీఎం కానివ్వరు అని చాలా మంది నమ్మారు. అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఏ చిన్న గొడవ జరగకుండానే రేవంత్ సీఎం కావడం జరిగిపోయింది. ఇక ఆయన తన పనితీరుతో ఆకట్టుకుంటున్నాడనే చెప్పాలి.
తాజాగా ఆయన దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణను ప్రమోట్ చేయడానికి రేవంత్ రెడ్డి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో విస్తృతంగా భేటీ అవుతున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి ప్రజంటేషన్ ఇస్తున్నారు. రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి 60కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వీరిలో చాలా మంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు.
కాగా, దావోస్ లో చలికాలం. భారత వాతావరణానికి అలవాటు పడిన వారు అక్కడ ఉండడం చాలా కష్టం. దావోస్ లో చలి వల్ల తాను అక్కడికి వెళ్లడం లేదని గతంలో ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ సెలవిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి చలి ప్రదేశంలో రేవంత్ రెడ్డి మాత్రం తన అధికార బృందంతో చలిని లెక్క చేయకుండా పెట్టుబడుల కోసం తెలంగాణను ప్రమోట్ చేస్తున్నారు. గతంలో కేటీఆర్ కూడా ప్రతీ ఏటా దావోస్ వెళ్లేవారు. కానీ రేవంత్ పాల్గొన్నట్లు ఆయన ఇన్ని సమావేశాల్లో పాల్గొనలేదు. రేవంత్ తన పూర్తి షెడ్యూల్ ను పారిశ్రామిక వేత్తలతో భేటీ కావడానికే ప్రాధాన్యమిస్తున్నారు.
దావోస్ లో జరిగే సమావేశాలన్నీ పెట్టుబడులుగా మారవు. అయినప్పటికీ తెలంగాణను ప్రమోట్ చేయడానికి అంతకుమించిన ప్రపంచ వేదిక దొరకదు. అందుకే మన పాలకులు దావోస్ ను కీలకంగా చూస్తారు. ఎప్పటికైనా వ్యాపార విస్తరణకు లేదా కొత్త వ్యాపార అవకాశాల కోసం తెలంగాణను పారిశ్రామికవేత్తలు దృష్టిలో పెట్టుకుంటారనే ఆలోచనతో పాలకులు వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.