Political Story : రెండు జోడీలు.. నలుగురు మిత్రులు.. మంచి ట్విస్ట్ లు ఉన్న రెండు రాష్ట్రాల పొలిటికల్ స్టోరీ..!

Political Story

Political Story

Political Story : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పొలిటికల్స్ నలుగురి మధ్య (రెండు జోడీల) నడుస్తున్నాయి. ఒక జోడీ ఏపీ పునర్నిర్మాణానికి నాంది పలికితే.. మరో జోడీ వినాశనానికి ఊతం ఇచ్చింది. అయితే ఈ జోడీల రాజకీయం మధ్య ‘నా’.. ‘మన’.. అనే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, రెండు దశాబ్దాల ప్రస్థానం ఉన్న చంద్రబాబు, పవన్ ఐదేళ్లలో అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ‘నా’ అనే స్వార్థాన్ని వీడి ‘మన’ అనే బంధానికి కట్టుబడి కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ మరో జోడీ కేసీఆర్, జగన్ ఇద్దరు ‘నా’ అనే స్వార్థానికి లొంగి ఏపీ భవిష్యత్ ను సమాధి చేశారు.

తాను కేసుల నుంచి బయటపడేందుకు అధికారంను ఉపయోగించుకొని పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి టీడీపీని దెబ్బ కొట్టారు జగన్. ఇక్కడ జగన్ ‘నా’ పార్టీ అధికారంలో ఉండాలి.. ‘నేను’ సీఎంను కావాలి, ‘నా’ కేసుల నుంచి బయటపడాలి. ‘నేనే’ శాశ్వతంగా సీఎం పీఠంపై కూర్చోవాలి అనే స్వార్థం తప్ప ప్రయోజనాలు పట్టలేదు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి (తెలంగాణ) ఐదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మరో ఐదేళ్లు పాలన కొనసాగించారు. ఆ సమయంలో ఆయన తెలంగాణ రాజకీయంలో ‘నా’ పార్టీ మాత్రమే ఉండాలి. గుర్తింపు ఉన్న నాయకులందరూ ‘నా’ పార్టీలోనే ఉండాలి, అధికారం ఎప్పుడూ ‘నా’ కుటుంబానికే ఉండాలి. పదవుల్లో ‘నా’ వారసులే మెలగాలి అనే స్వార్థంతో టీటీడీపీని దెబ్బకొట్టిన కేసీఆర్ పొరుగు రాష్ట్రం డెవలప్ అడ్డుకునేందుకు ఏపీ టీడీపీ ని భూస్థాపితం చేసేందుకు జగన్ తో చేతులు కలిపారు.

ఈ ఇద్దరు మాజీ సీఎంలది ఒకటే స్వార్థం ‘నా’ పార్టీ, ‘నా’ అధికారం..! అయితే, వీరికి భిన్నంగా బాబు, పవన్ ‘మన’ అనే సంప్రదాయానికి తెర లేపారు. ‘మన’ రాష్ట్రం కోసం, ‘మన’ తెలుగు వారి కోసం అంటూ తమ అనుభవం స్టార్ హోదాను పక్కన పెట్టి రాష్ట్రం కోసం కలిసి నడుస్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతున్నారు.

ఏపీకి వైసీపీ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని భావించిన బాబు, పవన్ తమను తానూ తగ్గించుకొని నాయకులను సైతం ఒప్పించి ‘పసుపు.. ఎరుపు’ కలయికతో రాష్ట్రానికి పట్టిన ‘నీలి నీడ’ను తొలగించారు. ‘మన’ బంధంతో బాబు, పవన్ బలం లేని బీజేపీకి బలంగా మారారు. బలహీనపడ్డ రాష్ట్రానికి అండగా నిలిచారు. ఇద్దరు వ్యక్తుల స్నేహం ‘నా’ అనే స్వార్థంతో రాష్ట్రాన్ని గాడి తప్పిస్తే, ఇద్దరు మిత్రుల ‘మన’ అనే బంధం రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు పునాదిగా మారింది.

TAGS