Covid-19:దేశవ్యాప్తంగా కరోనా మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. లేటెస్ట్ వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో పరీక్షించబడ్డారు. కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 6 కొత్త యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పూణెలోని ల్యాబ్‌కు పంపారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో కూడా కేసు నమోదైంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్‌కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.