Kishan Reddy : టీటీడీ ప్రాంగణంలో రాజకీయ సంబంధిత అంశాల గురించి మాట్లాడడం, రాజకీయ ప్రసంగాలు చేయడంపై నిషేధం విధిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీటీడీ నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈరోజు తిరుమల వేంకటేశ్వరస్వామిని సందర్శించిన సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతేగాకుండా ఆలయ ప్రాంగణంలో రాజకీయ ప్రసంగాలు చేసిన వారికి ఎటువంటి ప్రత్యేక ప్రవేశాలు, దర్శనాలు కూడా కల్పించకుండా నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే ఇలాంటికి కట్టడవుతాయని ఆయన అన్నారు.
‘‘తిరుమలలో ఇటువంటి ప్రసంగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు పనిచేయకూడదు. ఈ విషయంలో టీటీడీ పాలకమండలి చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. వీరందరినీ ఇతర శాఖలకు, ఇతర ప్రాంతాలకు బదిలా చేయడానికి తీసుకుంటున్న చర్యలు సరైనవే. ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయి. అందుకు అనుగుణంగానే అందులో పనిచేసే సిబ్బంది కూడా ఉండాలి. గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక వ్యవహారాలు నడిచాయి. కల్తీ నెయ్యి లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా పాలకమండలి గాని అధికార యంత్రాంగం గాని పట్టుదలగా పని చేయాలని కోరుకుంటున్నా’’ అని కిషన్ రెడ్డి అన్నారు.