Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై నాగబాబు స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించగానే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టే టీడీపీ ఈ పదవిని నాగబాబుకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు. పార్టీ అధికారిక హ్యాండిల్స్ లేదా నా వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. తప్పుడు వార్తలను నమ్మడం లేదా ప్రచారం చేయడం చేయొద్దు’’ అని నాగబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాగబాబు కుటుంబం పాల్గొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కళ్యాణ్ విజయం సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులం అందరం గెట్ టుగెదర్ లా చిన్న పార్టీ చేసుకున్నామని తెలిపారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకలో పాల్గొన్నట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ కుటుంబం పవన్ కు అండగా ఉంటుందని వెల్లడించారు. పార్టీకి సేవ చేయడం తప్ప పదవులపై తనకు ఆలోచన లేదన్నారు.