TTD Bumper Offer New Couple : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. మిలియనీర్ల నుంచి పేదల వరకు ఒక్కసారైనా తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవ స్థానం కూడా ప్రత్యేక దర్శనాలు, లఘు దర్శనాలు, బ్రేక్ దర్శనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపీలు, మంత్రులు, టీటీడీ బోర్డు మెంబర్లు సిఫారసు లేఖల ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇవేమి లేని వారు సర్వదర్శనంలో
స్వామి వారి ఆశీస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించి ఆశీర్వాదం పొందుతుంటారు. ఇంకొందరు అలిపిరి నుంచి కాలినడకన వెళ్తుంటారు. పండుగలు, ఉత్సవాల సమయంలోనూ స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
కొంత మంది తమ ఇళ్లల్లో నవ దంపతులను తిరుమల దర్శనానికి తీసుకెళ్తుంటారు. మరి కొందరు తిరుమలలో స్వామివారి సన్నిధిలోనే వివాహం చేస్తుంటారు.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా, కొత్తగా పెళ్లి చేసుకుబోయే వధూవరులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కొత్త జంటలకు శ్రీవారి తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు, కుంకుమ, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని అందించే కార్యక్రమాన్ని టీటీడీ పునఃప్రారంభించింది. ఈ విధానాన్ని టీటీడీ గతంలో అమలు చేసింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా టీటీడీ ఈ విధానాలను తాత్కాలికంగా నిలిపి వేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించేందుకు టీటీడీ నిర్ణయించింది.
ఇవి పొందాలంటే పెళ్లి ముహూర్తానికి నెల రోజుల ముందు శుభలేఖ టీటీడీకి పంపాల్సి ఉంటుంది. తమకు శుభలేఖ అందిన వాటిని పోస్టులో పంపుతామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులు తమ అడ్రస్ ను పొందుపర్చాల్సి ఉటుంది. అలాగే స్వామివారి ప్రసాదం, పసుపు, కుంకుమ పొందేందుకు ఈ అడ్రస్ కు శుభలేఖ పంపాలి. ఎగ్జి్క్యూటివ్ ఆఫీస్, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ భవనం, కేటీ రోడ్, తిరుపతి-517501 అనే చిరునామాకు కార్డు పంపాలని టీడీటీ అధికారులు వివరించారు.