TSRTC Good News : ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు స్పషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లో ఉన్నవారు ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే రైళ్లలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలో ఓటున్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 9 నుంచి ఏపీకి రద్దీ ఉంటుందని, శని, ఆదివారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రెండు రోజులు సిటీ బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల రోజు ప్రజలు వెళ్లేందుకు తెల్లవారు జాము నుంచి.. తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులకు అదనంగా వెయ్యికి పైగా బస్సులను సిద్ధంగా ఉంచుతోంది. 200 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.