JAISW News Telugu

TS Budget 2024: బడ్జెట్ వరాలు : రైతుకు రుణమాఫీ.. ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు

TS Budget

TS Budget

TS Budget 2024 : కాంగ్రెస్ ఎన్నికల హామీలో పేర్కొన్నట్టుగా అన్నదాతలకు రుణమాఫీ, ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు అందజేయనుంది. ఈమేరకు ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులు కేటాయించారు.  రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ను రూపొందించారు.

ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నో హామీలతో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు జనాలు గెలుపు అందించడంతో ఆ పార్టీ తన హామీలను అమలు చేసే కసరత్తు మొదలుపెట్టింది. కీలక హామీల్లో రైతులకు రుణమాఫీ, ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు అందించడానికి నిధులు కేటాయించింది.

రైతు బాగుకు రుణమాఫీ..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన రెండు టర్మ్ ల్లో రుణమాఫీని చేసింది. అయితే మొదటి టర్మ్ లో రుణమాఫీ సజావుగానే జరిగినా.. రెండో టర్మ్ లో మాత్రం రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. రుణమాఫీ చేయడానికి ఐదేండ్ల కాలం తీసుకుంది. ఇంకా కొద్దిమందికి రుణమాఫీ కాలేదు. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై ఇవ్వాళ్టి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి భట్టి మాట్లాడుతూ..రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని, అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే కార్యాచరణ, విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే ప్రతీ పంటకు మద్దతు ధర అందిస్తామన్నారు.

నెరవేరనున్న పేదవాడి ఇంటి కల..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో లక్షలాది ఇండ్లకు నిధులు అందించింది. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ పథకం అట్టర్ ప్లాప్ గా నిలిచింది.  ఒక్క హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల తప్ప..రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ ఈ పథకం సద్వినియోగం కాలేదనే చెప్పాలి.

బీఆర్ఎస్ ఓటమి కారణాల్లో ఇండ్ల పథకం కూడా ఒకటి. ఆ తప్పును సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కట్టుకోవాలనుకునే లక్షలాది పేదలకు ఈ బడ్జెట్ లో శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని తెలిపింది. ఈమేరకు మంత్రి భట్టి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను వినియోగించుకో లేదన్నారు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ. 7,740 కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version