KTR Assurance For Unemployed : తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అన్ని పార్టీలు తమదైన ప్లాన్లతో ముందుకెళ్తున్నాయి. అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీ కి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. దీనిని గుర్తించిన మంత్రి కేటీఆర్ నిరుద్యోగులను తమవైపు తిప్పుకనే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే అధికార బీఆర్ఎస్ పై నిరుద్యోగులంతా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ఈ క్రమంలోనే ఆయన వారిని కలిసి భరోసా ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముగిసిన మరుసటి రోజే తానో శుభవార్త చెబుతానని చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళప చేస్తానని హామీనిచ్చారు. అశోక్ నగర్ తో పాటు ఉస్మానియా యూనివర్సీటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిని ఆయన కలిసి మాట్లాడారు.
దాదాపు రెండు గంటల పాటు వారితో చర్చించారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇక ఇప్పటికే లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తెలంగాణ కంటే ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇంత స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టాలని సూచించారు. కచ్చితంగా నిరుద్యోగులకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. మరోసారి అధికారంలోకి రాగానే, పోస్టుల సంఖ్య పెంచి మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని భరోసానిచ్చారు. తాను కూడా ప్రైవేట్ రంగంలో పని చేశానని, ఒక అన్నలా మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని చెప్పారు.