Trump : ట్రంప్-జెలెన్ స్కీ వాగ్వాదం.. యుద్ధం ఆగేలా కనిపించడం లేదే?

Trump

Trump

Trump and Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య శాంతి ఒప్పందం, ఖనిజాల తవ్వకం వంటి కీలక అంశాలపై జరిగిన భేటీ రసాభాసగా మారింది. శ్వేతసౌధంలో జరిగిన ఈ చర్చలు వాగ్వాదానికి దారితీయడంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే జెలెన్‌స్కీ వెనుదిరిగారు.

ఈ సమావేశంలో జెలెన్‌స్కీ, భవిష్యత్తులో రష్యా దాడుల నుండి ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించాలని అమెరికాపై ఒత్తిడి తీసుకువచ్చారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. అయితే, ఉక్రెయిన్ తీరును ట్రంప్ అవమానకరంగా భావించారు. ఉక్రెయిన్ కు సాయపడుతూ వచ్చిన దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని ట్రంప్ ఆగ్రహంతో స్పందించారు. ఉక్రెయిన్ డిమాండ్ చేసే స్థితిలో లేదని.. ఇలాంటి వైఖరితో లాభం ఉండదని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ మాటలకు ప్రతిస్పందనగా, జెలెన్‌స్కీ తాము ఎవరికి తలవంచే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం నిలబడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల ఘర్షణ తలెత్తింది. చర్చలు సజావుగా సాగుతాయనుకున్నప్పటికీ, కాసేపటికే వాగ్వాదం చెలరేగడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా అసహనానికి గురయ్యారు. ఈ సంఘటనను చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తల పట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ భేటీ అనంతరం జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం ఉక్రెయిన్ భద్రతకు అనుకూలంగా ఉండాలని, తాము మూడో ప్రపంచ యుద్ధం కోరుకోవడం లేదని వెల్లడించారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాల గురించి మాట్లాడుతూ, ట్రంప్ తటస్థంగా ఉండాలని, కానీ ఉక్రెయిన్ వైపు నిలబడాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

చివరకు ఒప్పందం కుదరకుండా వాగ్వాదంతోనే ఈ సమావేశం ముగిసింది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమెరికా, ఉక్రెయిన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఎలా కొనసాగుతాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

TAGS