Amrapali Kata : తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో 44మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నారు. ఇప్పటివరకూ ఆ పోస్టులో ఉన్న రొనాల్డ్ రోస్‌ని బదిలీ చేసి ఆయన స్థానంలో ఆమ్రపాలిని నియమించారు. ఇటీవల రేవంత్ సర్కార్ ఆమ్రపాలిని..మూడు రోజులపాటూ.. జీహెచ్ఎంసీ ఇన్ చార్జి కమిషనర్‌గా నియమించింది. ఆ సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్.. మూడు రోజులపాటూ సెలవు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమ్రపాలి.. ఈ విధులను సమర్థంగా నిర్వహించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా.. ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందారు. ఆమెనే ఈ పోస్టులో పర్మినెంట్ గా పెడితే.. దుమ్మురేపుతారని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు జిల్లాలోని ఎన్.అగ్రహారం. ఆమె కాటా వెంకటరెడ్డి, పద్మావతిల మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివి… ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణలో కలెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆమె జీహెచ్ ఎంసీ కమిషనర్‌గా నియమితులయ్యారు. లేడీ సింగంగా పిలుచుకునే ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని.. గతేడాది డిసెంబర్‌లో మహానగరాభివృద్ది సంస్థ (హెచ్ఎండీఏ) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు.
ఈ క్రమంలో ఆమ్రపాలి పనిలో తన మార్క్ చూపించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా సిటీ రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే.. సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన పూర్తి బాధ్యత ఆమెపై ఉంటుంది. ఆమ్రపాలి విధుల నిర్వహణలో ఎక్కడా రాజీ పడరు. అవతలి వాళ్లు ఎలాంటి వారైనా, ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. అందుకే ఆమె ట్రాక్ రికార్డ్ మొత్తం ఇలాగే సాగింది. అందువల్ల ఆమె ఈ పదవి ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి.