Train Accident : పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దాంతో ఇప్పటికి 15 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి.న్యూ జల్పాయ్ గురి రైల్వే స్టేషన్ వద్ద 13174 కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్, మరో గూడ్స్ ట్రెయిన్ ఢీకొన్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సీల్దాకు కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్ వెళ్తోంది. మధ్యలోని న్యూ జల్పాయిగురి వద్ద సిగ్నల్ కోసం ఈ ఎక్స్ ప్రెస్ ఆగింది. ఆ వెంటనే వెనక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్ ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎక్స్ ప్రెస్ రైలు రెండు బోగీలు పైర్తిగా పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలోని ఓ బోగీ గాల్లోకి లేచి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. సిగ్నల్ జింపింగ్ ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.