Monkeypox : మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైద్య ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జారీ చేసిన హెల్త్ అడ్వైజరీ ప్రకారం భారత్ లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నిర్ధారణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని సూచించింది.
రాష్ట్రాలు చర్మ, ఎస్టీడీ వ్యాధులకు చికిత్స చేసే క్లీనిక్స్ పై దృష్టి పెట్టాలని పేర్కొంది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది.
ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారి ఓ మనిషికి ఈ వ్యాధి సోకింది. మంకీపాక్స్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్)గా వర్గీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడమే ఆందోళనకు కారణం. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.