Death Valley : రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ‘డెత్ వ్యాలీ’కి పర్యాటకుల తాకిడి!
Death Valley : మనందరినీ ఆశ్చర్యపరిచే అనేక అంశాలు ప్రకృతిలో ఉన్నాయి. చాలా సార్లు శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి కూడా అదే చెబుతారు. ఈ ప్రదేశం అమెరికాలోని తూర్పు కాలిఫోర్నియా, నెవాడా మధ్య ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. రంగురంగుల రాళ్ల కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ రాళ్లు వాటంతట అవే కదులుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు నమోదయ్యే ప్రాంతంగా డెత్ వ్యాలీ జాతీయ పార్క్‌కు గుర్తింపు ఉంది. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున దేశ, విదేశీ పర్యటకులు తరలివస్తున్నారు. ఇక్కడ నమోదయ్యే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతను స్వయంగా అనుభూతి చెందుతున్నారు. డెత్ వ్యాలీలో ఉంటే పొయ్యిలో ఉన్నట్లే ఉంటోందని పర్యాటకులు చెబుతున్నారు.
50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో అక్కడి నేషనల్ పార్క్ యాజమాన్యం వద్దని చెబుతున్నా పర్యాటకులు వినడం లేదు. తాజాగా ఓ బైక్ రైడర్ వేడి దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయినా పర్యటకులు ఆగడం లేదు. అసలు ఈ డెత్ వ్యాలీ ఎందుకంత ప్రమాదకరమో తెలుసుకుందాం. డెత్‌వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతం. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులే. ఇక్కడ 1913లో జులై 10న అత్యధికంగా 134 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత నమోదైంది. కాకపోతే ఇది సరికాదనే వివాదం కూడా ఉంది. కానీ, 2020 ఆగస్టు 16, 2021 జులై 9, 2023 జూన్ 16వ తేదీల్లో 130 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదైంది. ఇక్కడి ఫర్నేస్ క్రీక్‌లోని అత్యాధునిక సెన్సర్లు వీటిని గుర్తించాయి. 129 డిగ్రీలు ఆరుసార్లు నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రత డెత్‌వ్యాలీ బయట కువైట్‌లో 2016 జులై 21న నమోదైంది. ఈ ఒక్క అంశమే డెత్ వ్యాలీ ప్రత్యేకతను చెబుతోంది. ఏడాదిలో 147 రోజులు సగటున అంటే అదీ ఏప్రిల్ 14 నుంచి అక్టోబర్ 12లోపు 100 డిగ్రీల ఫారెన్‌ఫారెన్‌హీట్ నమోదవుతుంది. ఏటా 92 రోజులు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారెన్‌హీట్. ఏటా 23 రోజులు సగటున 120 డిగ్రీల వేడి ఉంటుంది.
ఇక్కడ కేవలం ఉష్ణోగ్రతలే కాదు..ప్రమాదకరమైన మెరుపు వరదలు కూడా చాలా సహజం. ఇక్కడ 2022 ఆగస్టులో వచ్చిన వరదలు ఇక్కడి పార్కులో విధ్వంసం సృష్టించాయి. 2015లో మెరుపు వరదలు ఇక్కడి రోడ్లను తుడిచిపెట్టేశాయి. డెత్ వ్యాలీలో ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఐరోపా దేశాల నుంచి భారీగా పర్యటకులు వస్తున్నారు. ఇక్కడి వేడి పర్యటకుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్ పార్క్ సూపర్ వైజర్ మైక్ రేనాల్డ్స్ హెచ్చరించారు.