Purandeshwari : ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సీటు పురందేశ్వరి కోరుకున్నది కాదు. ఆమెకు విశాఖ నుంచి చేయాలని అనుకున్నారు. విశాఖలో బీజేపీకి క్యాడర్ ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఉత్తరాది వారి జనాభా అధికంగా ఉంది. పైగా ఆమె గతంలో గెలిచిన సీటు. దీంతో బీజేపీ చీఫ్ గా తాను అక్కడనుంచే పోటీ చేయాలని భావించారు.
అయితే రాజమండ్రి నుంచి పురందేశ్వరి గెలుపు అంతా ఈజీ కాదు. ఎందుకంటే ఆమె నాన్ లోకల్ అన్న ప్రచారం మొదలైంది. పైగా ఆ సీటును బీజేపీ సీనియర్ లీడర్ సోము వీర్రాజు కోరుకున్నారు. ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పి బీజేపీ పెద్దలు చిన్నమ్మను అక్కడికి పంపారు. దీంతో సోము వీర్రాజు వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. సోముకు సీటు కేటాయించపోవడం వల్ల ఆ సామాజిక వర్గంలో బాధ వ్యక్తం అవుతోందంటున్నారు.
రాజమండ్రిలో పురందేశ్వరికి బేస్ ఏదీ లేదు. బీజేపీకి పట్టు కూడా అంతంత మాత్రమే. పూర్తిగా జనసేన మీదనే ఆధారపడాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లలో 5 చోట్ల టీడీపీ పోటీ చేస్తుంటే రెండు చోట్ల జనసేన బరిలో ఉంది. అదే విధంగా ఈసారి గెలవడం ఆమెకు తప్పనిసరి. ఆమె రాజకీయ జీవితానికి కీలక మలుపు కూడా.