Kodali Nani : ఉమ్మడి కృష్ణా జిల్లాలో హోరాహోరీ.. కొడాలి నాని ఇంటికే..
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. వైసీపీ, ఎన్డీయే కూటముల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. చాలా సీట్లలో ముఖా ముఖి పోరు నెలకొంటుందని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై సర్వేలు జరుగుతున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నాయి. అత్యధిక సర్వేలు టీడీపీ కూటమి వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాపై సెఫాలజిస్ట్ పార్థాదాస్ చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్థాదాస్ సర్వే మాత్రం కూటమి కంటే రెండు, మూడు సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. కృష్ణా జిల్లా అసెంబ్లీ సీట్లలో వైసీపీ, టీడీపీ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇందులో మెజార్టీ స్థానాలు వైసీపీకే దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మిగతా చోట్ల వైసీపీ, టీడీపీ సగం సీట్లలో ఆధిక్యం కొనసాగుతుందని అంటున్నారు. విజయవాడలో పూర్తిగా వైసీపీ హవా ఉంటుందంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9-10 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. టీడీపీకి 6-7 సీట్లు లభించే అవకాశాలున్నాయని చెబుతోంది. విజయవాడలోని మూడు సిటీ సీట్లలో వైసీపీకే ఆధిక్యం కనిపిస్తోందంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తుందంటున్నారు. మిగతా సర్వేలు ఏం చెబుతాయో చూడాల్సిందే.
నూజివీడులో స్వతంత్ర అభ్యర్థి వల్ల టీడీపీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపనుందని అంటున్నారు. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో టీడీపీ విజయం సాధిస్తుందని తేల్చారు. జిల్లాలోని ముస్లిం ఓట్లలో 70 శాతం పైగా వైసీపీకే మొగ్గు చూపుతున్నారని తేలింది. 26 శాతం మాత్రమే టీడీపీ వైపు ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ఈ సర్వేను టీడీపీ కూటమి కొట్టిపారేసింది. అది ఫేక్ సర్వే అని, వైసీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడించి ప్రజలను అయోమయానికి గురిచేయడమే దాని లక్ష్యమని విమర్శించారు. ఫేక్ సర్వేలు ఎన్ని వచ్చినా టీడీపీ కూటమి విజయాన్ని ఆపలేరని, కూటమికే ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. జూన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.