AP Govt : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టమాటా ధరలు కొండెక్కాయి. పది రోజుట కిందట కిలో రూ.30 వరకు పలికిన టమాటా, ఇప్పుడు సెంచరీ కొడుతోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రేటు వంద రూపాయల వరకూ చేరింది. చాలా చోట్ల కేజీ రూ.80 వరకూ పలుకుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టమాటా రేట్ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు ప్రారంభించింది. టమాటాలను సబ్సిడీ రేట్లకు రైతు బజార్లలో విక్రయించాలని ఏపీ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో చిత్తూరు మార్కెట్ల నుంచి టమాటాను కొనుగోలు చేసి రైతు బజార్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా టమాటాలను కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలోని మార్కెట్ల ద్వారా 30 టన్నుల టమాటాలను కొనుగోలు చేసి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని రైతు బజార్లలో విక్రయించనున్నారు. అందుకోసం జిల్లా అధికారులకు రూ.5 లక్షలతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు.