Revanth Reddy:సీఎం రేవంత్‌రెడ్డికి టాలివుడ్ డైరెక్ట‌ర్ బ‌హిరంగ లేఖ‌!

Revanth Reddy:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజ‌యాన్ని సాధించి కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అత్య‌దిక సీట్ల‌ని ద‌క్కించుకుని అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి త‌న‌దైన దూకుడుతో, త‌న మార్కు పాల‌న‌ని ప్రారంభించారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజునే కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల హామీల్లోని ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతంకం చేసి ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌ని నిరూపించారు.

ఆ వెంట‌నే మ‌హిళ‌ల‌కు, అమ్మాయిల‌కు, పిల్ల‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌క‌టించిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ప్ర‌జా స‌మస్య‌లు తెలుసుకోవ‌డం కోసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ప్ర‌జాభ‌వ‌న్‌గా మార్చి `ప్ర‌జాద‌ర్బార్` నిర్వ‌హించారు. ఇక రైతు బంధు నిధుల‌ను విడుద‌ల చేస్తూ త‌న మార్కు దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్ట‌ర్ సంజీవ్‌రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ లేఖ రాయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సినీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని సీఎం రేవంత్‌కు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశాడు. తెలంగాణ‌లో సినిమా అవార్డు ఫంక్షన్‌ల‌ను, ఫిల్మ్ ఫెస్టివెల్స్‌ను నిర్వ‌హించాల‌ని కోరారు. అంతే కాకుండా అర్హులైన క‌ళాకారుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు, పాత్రికేయుల‌కు ఇల్లు, లేదా స్థ‌లాలు ఇచ్చి సుసంప‌న్న‌మైన సాంస్కృతిక వార‌స‌త్వానికి, చైత‌న్యవంత‌మైన సృజ‌నాత్మ‌క వాతావ‌ర‌ణానికి దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌ర‌ని లేఖ‌లో పేర్కొన్నాడు.

హైద‌రాబాద్ వాసిగా నా విజ్ఞ‌ప్తి అంటూ నాలాలు, ట్రాఫిక్ స‌మస్య‌ల‌ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సంజీవ్‌రెడ్డి యంగ్ హీరో అల్లు శిరీష్‌తో `ఏబీసీడీ` అనే సినిమాతో పాటు రాజ్ త‌రుణ్‌తో `అహ‌నా పెళ్లంట‌` అనే వెబ్ సిరీస్‌ని కూడా రూపొందించాడు.

TAGS