Mallikarjun Kharge:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అధికార పార్టీని ఈ ఎన్నికల్లో మట్టి కరిపించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు తగిన సీట్లని సాధించింది. 64 సీట్లని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే సీఎం ఎవరు? మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుంది?. డిప్యూటీ సీఎంగా ఎవరిని ప్రకటిస్తారు? వంటి అంశాలపై రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన టీపీసీసీ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఉత్కంఠకు ఈ రోజు (మంగళవారం) తెరపడనుందని తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఇండియా కూడమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లే ముందు మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. తెంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రోజు స్పష్టతనిస్తామన్నారు. సోమవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న డీకె శివకుమార్, మంగళవారం మధ్యాహ్నం ఖర్గేతో సమావేశం అవుతారు. ఇప్పటికే తెలంగాణ పరిణామాలపై ఖర్గే సహా కాంగ్రెస్ నేతలకు డీకె శివకుమార్ సమాచారం ఇచ్చారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారిద్దరూ కూడా ఖర్గేతో సమావేశం కానున్నారు.