Medaram Jatara : నేడు జంపన్న.. రేపు సారలమ్మ, పగిడిద్దరాజు.. మేడారం జాతర షురూ
Medaram Jatara : వనదేవతల చల్లని చూపుల కోసం భక్తజనం పులకించి పోతుంది. సమ్మక్క-సారలమ్మపై భక్తులకు విశ్వాసం ఎక్కువ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ములుగు జిల్లాలోని, తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో రెండేళ్లకోసారి వైభవంగా సాగుతుంది. 2024కు సంబంధించి జాతర తేదీలను ప్రకటించారు కోయ పూజారులు..
జాతర తేదీలు..
వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి ఫిబ్రవరి 21వ తేదీ పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 22న సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. 23వ తేదీ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత రోజు ఫిబ్రవరి 24వ తేదీ అమ్మవార్లతో పాటు అయ్యవార్లు వన ప్రవేశం చేస్తారు. ఇక, ఫిబ్రవరి 28న జాతర పూజల ముగింపు ఉంటుంది.
కీలక ఘట్టాలు..
జాతరలో ముఖ్య ఘట్టం.. పగిడిద్దరాజను గద్దెకు తీసుకురావడం. పగిడిద్దరాజును గిరిజన సంప్రదాయాలతో గద్దెపైకి తీసుకువస్తారు. పగిడిద్దరాజుది జాతరలో ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం, పునుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పగిడిద్దరాజును పెళ్లి కొడుకును చేస్తారు. మర్నాడు ఆలయానికి చేరుకొని, బలి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొత్త దుస్తులు ధరించిన పగిడిద్ద రాజుతో కోయ పూజారులు మేడారానికి బయల్దేరుతారు.. సాయంత్రానికి పగిడిద్దరాజు మేడారం చేరుకుంటాడు. పగిడిద్దరాజును గద్దెకు వచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని అలంకరిస్తారు. ఆ తర్వాత.. పగిడిద్దరాజుకు ఆహ్వానం పంపుతారు. పగిడిద్దరాజు-సమ్మక్కను ఎదురెదురుగా కూర్చొబెట్టి.. వాయినం ఇచ్చిపుచ్చుకొని.. వివాహ తంతు పూర్తి చేస్తారు. పగిడిద్దరాజును సారలమ్మ గద్దె వద్దకు తీసుకెళ్తారు.
అదే రోజు ఉదయం సారలమ్మకు కన్నేపల్లిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి మేడారానికి తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలో మీటర్లు ఉంటుంది. సారలమ్మ గద్దెకు వచ్చే లోపే తండ్రి పగిడిద్దరాజు ఆమెకు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజు కూడా కొండాయి గ్రామం నుంచి గద్దెల వద్దకు చేరుకుంటాడు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకొని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజున పగిడిద్దరాజు, సారలమ్మ-గోవిందరాజు గద్దెలపైకి చేరుకుంటారు.
ఇక తల్లి సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయల్దేరుతుంది. అధికార లాంఛనాలు, పోలీసుల గౌరవ వందనం, ఎదుర్కోళ్ల ఘట్టంతో సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నార చెట్టు కింద కుంకుమ భరిణె రూపంలోని తల్లి ఉంటుంది. ఆమెను అదే రూపంలో కోయ పూజారులు గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతర మెుత్తానికి ఇదే కీలక ఘట్టం. దీని తర్వాత పగిడిద్దరాజు-సమ్మక్కతో పాటు కొడుకు జంపన్న, కూతురు సారలమ్మ భక్తుల మొక్కులను స్వీకరిస్తారు. జాతర ముగిసిన తర్వాత దేవతలు వనంలోకి ప్రవేశిస్తారు. దీంతో జాతర పరిపూర్ణం అవుతుంది. మళ్లీ జాతర 2026లో ప్రారంభం అవుతుంది.