Parade of Planets 2024 : ఆకాశంలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, భూమి గురించి నిత్యం ఎన్నో ఆసక్తికర కథనాలు మనం వింటూనే ఉంటాం. కొన్నింటిని మనం కండ్లతో చూడలేకపోయిన వాటి గురించి విని ఆనందిస్తుంటాం. కొన్నింటిని మాత్రం నేరుగా చూడవచ్చు. అకాశంలో అద్భుతాలను స్వయంగా చూడాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కొన్ని అరుదైన ఘట్టాలను చూసే అదృష్టం మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది.
అలాంటిందే జూన్ 3న(సోమవారం) నేడు ఆకాశంలో అద్భుతం జరుగనుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహలు రాబోతున్నాయి. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూసి ఆనందించేందుకు మానవాళి రెడీగా ఉంది. బుధుడు(మెర్క్యూరీ), బృహస్పతి(జూపిటర్), శని (శాటర్న్), అంగారకుడు(మార్స్), వరుణుడు(యురేనస్), ఇంద్రుడు(నెఫ్య్టూన్) ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ అద్భుతమైన ఖగోళ ఘట్టం కొన్ని రోజుల పాటు కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉత్తరార్ధగోళంలో సూర్యోదయానికి 20 నిమిషాల ముందు తూర్పు దిక్కున జుపిటర్, మార్స్ ను నేరుగా కండ్లతో చూడవచ్చని, మిగతా గ్రహాలను టెలిస్కోప్ వంటి పరికరాల సాయంతో మాత్రమే వీక్షించవచ్చని వారు చెప్పారు.
ఈ దృశ్యాన్ని చూడాలనుకునేవారు సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయానికి ముందు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ అద్భుతాన్ని మనం చూడవచ్చు. ఈ దృశ్యం చివరిగా 2004లో కనువిందు చేసింది. తాజాగా నేటి నుంచి ఈ దృశ్యం మరోసారి కనువిందు చేయనుంది. ఇలా ఆరు గ్రహాలు ఒకే రేఖపై రావడాన్ని ‘పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’ అంటారు. దీన్నే తెలుగులో ‘గ్రహాల కవాతు’ అంటున్నారు. ఇది మళ్లీ 2492 మే 6వ తేదీన సంభవించనుందని సైంటిస్టులు చెబుతున్నారు.